మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కలెక్టరేట్ ఎదుట ధర్నా

నేటి నుంచి సమ్మె బాట

ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సూతారి రాములు డిమాండ్

జగిత్యాల ప్రతినిధి, జూలై 10(ప్రజా బలం) గత కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సూతారి రాములు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా
ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సూతారి రాములు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మధ్యాన్న భోజన కార్మికులు కోడిగుడ్డు బిల్లులు, మెస్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో గతంలో చేసిన పోరాటాల ఫలితంగా ఫిబ్రవరి 15 న వేతనాలను పెంచుతూ జీవో 8 జారీ అయినా నేటికి వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్ కు, డీఈవోలకు వినతిపత్రాలు ఇచ్చిన ఎలాంటి ఫలితం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వంటలు బంద్ చేసి ఈ రోజు నుంచి సమ్మె బాట పడుతున్నామని సూతారి రాములు హెచ్చరించారు. అలాగే వంట కార్మికుల తొలగింపులను వెంటనే ఆపాలని, కార్మికుల గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల నెత్తిన కొత్త మెనూ పెట్టిందని 8 గంటలకు రాగి జావాతో పని మొదలెట్టి ఇంటికి వెళ్లే సరికి రాత్రి 8 అవుతుందని అప్పుడు పార్ట్ టైమ్ వర్కర్ల్ ఎలా అవుతారని సూతారి ప్రశ్నించారు. కేరళ ప్రభుత్వం తరహాలోనే కనీస వేతనం రోజుకు 6 వందలు అందించాలని రాములు కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్, యూనియన్ జిల్లా కన్వీనర్ చెన్నవేని దశరథం, కో కన్వీనర్ హనుమంతు, కార్మిక సంఘ నేతలు కొంక భాగ్య, సంఘం పద్మ, ఎండి రజియా, అక్కవా, సఫియా బేగం, లక్ష్మి, నర్సు, విజయ, గంగు, కూర గంటి శ్రీనివాస్, అందే వంశీకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking