ఖమ్మం ప్రతినిధి జూలై 25 (ప్రజాబలం) ఖమ్మం ప్రభుత్వం రుణమాఫీ చేసిన అర్హులైన రైతులందరికీ వాటి ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతుల రుణాల రెన్యువల్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రఘునాధ పాలెం వి. వెంకటాయపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తనిఖీ చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతుల రుణాల రెన్యువల్ ప్రక్రియను పరిశీలించారు. రుణమాఫీ రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్ రుణమాఫీ జరిగిన రైతులందరి రుణాలు త్వరితగతిన రెన్యూవల్ చేయాలని, రుణ మాఫీ ఫలాలు సంబంధిత రైతులకు అందేలా చూడాలని అన్నారు. పిఏసీఎస్ పూలింగ్ ఖాతాకు చేరిన మొత్తం సంబంధిత రైతు ఖాతాకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 2018 సంవత్సరం కట్ ఆఫ్ గా, 2023 వరకు అవుట్ స్టాండింగ్ లోన్లు పరిగణలోకి తీసుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని, ఎంతమందికి మొదటి విడతలో రుణమాఫీ అయింది, ఎంతమంది డబ్బులు తీసుకున్నది, రానివారికి కారణం వివరించి అవగాహన కల్పించాలన్నారు. మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో 57857 మందికి మొదటి విడతలో రుణమాఫీ కాగా, ఇప్పటికి 51000 మందికి జమ అయినట్లు, మిగతా వారికి వివిధ కారణాల వల్ల జమకాలేదని, కారణాలు సరిచేసి, వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ సహాయ సంచాల కులు శ్రీనివాసరావు, రఘునాధపాలెం మండల వ్యవసాయ అధికారి భాస్కర రావు, డిసిసిబి బ్యాంక్ మేనేజర్ తిరుపతి రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు