వానాకాలం పంట కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను సమగ్ర ప్రణాళికతో చేపట్టాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వానాకాలపు పంట కొనుగోలుపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో పౌర సరఫరాలు, సహకార శాఖ, డిఆర్డీఏ, మార్కెటింగ్, జిసిసి, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం ధాన్యం కొనుగోలుకు ముందస్తుగా కార్యాచరణ రూపొందించుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పంట సాగుచేసిన రైతులు ఏ దశలోనూ ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ చేయాలన్నారు. తరుగు, కడ్తా పేరుతో రైతులు నష్టపోకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పూర్తిస్థాయిలో మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలో సాగవుతున్న వరి పంట రకాలను నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేయాలని తెలిపారు. రైస్ మిల్లర్లు సి ఎం ఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. టార్ఫాలిన్లు, మాయిచ్చర్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారికి సూచించారు. తుకపు బాట్లు తనిఖీ చేయాలని తూనికలు కొలతల అధికారికి సూచించారు. జిల్లాలో అక్రమంగా ధాన్యం తరలింపును అరికట్టాలని, దానికి తగిన చర్యలు చేపట్టాలని రవాణాశాఖ అధికారులుకు ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్ , జిల్లా పౌరసరఫరాశాఖ అధికారి రుక్మిణి, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్ వ్యవసాయశాఖ అధికారి బాబురావు, జిల్లా రవాణా శాఖ అధికారి సదానందం తదితరులు పాల్గొన్నారు