ఒక్క ఏడాదిలో రూ.2752 కోట్లు విడుదల
జిహెచ్ఎంసి అభివృద్ధికి ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది
గత ప్రభుత్వం పదేళ్లలో విడుదల చేసిన నిధులు రూ.3652 కోట్లు మాత్రమే
నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, ఏప్రిల్ 08: జిహెచ్ఎంసి కి నిధుల కేటాయింపులో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన రికార్డు నమోదు చేసిందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిహెచ్ఎంసి కి సుమారుగా రూ.6045 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.2752 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. అందులో బడ్జెట్ లో కేటాయించిన రూ.2,965.61 కోట్లలో రూ.1552.52 కోట్లు విడుదల చేయగా, స్టాంప్ డ్యూటీ అమౌంట్ రూ.1150 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూ.49.36 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం జీహెచ్ఎంసీకి పది సంవత్సరాల కాలంలో (2014-2023) కేవలం రూ.3652 కోట్ల నిధులు విడుదల చేసిందని, అందులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ గ్రాంట్ రూ.1415.39 కోట్లు కాగా, స్టాంప్ డ్యూటీ రూ.1776.53 కోట్లు, కేటాయించిన బడ్జెట్లో రూ.460.79 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం జిహెచ్ఎంసి కి 10 సంవత్సరాలలో ఇచ్చిన మొత్తం కంటే ప్రస్తుత ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే ఎక్కువ నిధులు విడుదల చేయడం జిహెచ్ఎంసి అభివృద్ధికి కీలకమైన సంకేతంగా చెప్పవచ్చన్నారు.
నిధుల కేటాయింపు, విడుదల నగర మౌలిక వసతుల అభివృద్ధికి, ట్రాఫిక్ నియంత్రణ పనులకు, వివిధ ప్రాజెక్టులకు, నగర శుభ్రతకు, ప్రజల భద్రతకు ఘననీయంగా తోడ్పడతాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించడం ఇందుకు నిదర్శనమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరాభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేయర్ నగర ప్రజల తరఫున కృతఙ్ఞతలు తెలిపారు.