బ్యాంకర్ల సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 17: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జిల్లా వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందచేసి వారి ఆర్థికాభ్యున్నతికి తోడ్పాటునందించాలని ఈ విషయంలో బ్యాంకర్ల పాత్ర ఎంతో కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు. శుక్రవారం శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల త్రైమాసిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ప్రభుత్వాలు అర్హులైన వారికి అనేక సంక్షేమ పథకాల కింద రుణాలను మంజూరు చేస్తున్నాయని వాటిని లబ్ధిదారులకు చేరేలా బ్యాంకర్లు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం మొదలుకొని వారికి రుణాలు అందించే వరకు బ్యాంకర్లు ఎంతో ముఖ్యభూమిక పోషిస్తారని అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఏసీపీ వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం 190 శాతం సాధించడం జరిగిందని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. దీంతో పాటు విద్యార్థులకు సంబంధించి వారి ఉన్నత చదువులకు విద్యారుణాలను అత్యధిక సంఖ్యలో మంజూరు చేయాలని ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చూపకుండా ఉంటే వారికి మంచి భవిష్యత్తును అందించిన వారమవుతామని అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణాల ప్రగతిని మరింత ఎక్కువ సాధించాలని, ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు, ప్ర్రాముఖ్యతా రంగాలలో లబ్దిదారులకు సకాలంలో రుణాలను అందించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని, నిజమైన లబ్దిదారులను ఆదుకోవాలని, వారి ఆర్ధిక వికాసానికి తోడ్పడాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లు లబ్దిదారులకు సంబంధించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని, తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తిరస్కరించేటప్పుడు కావలసిన సలహాలు, కారణాలను దరఖాస్తుదారునికి తెలియచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా లీడ్ బ్యాంక్ మేనేజరు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అందచేసిన రుణాల వివరాలను తెలుసుకొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కిశోర్ కుమార్, కెనెరా బ్యాంకు ఏజీఎమ్ ఇందిర, ఎస్బీఐ ఏజీఎమ్ సతీష్; యూబీఐ ఏజీఎమ్ ప్రకాశ్రావు, టీజీబీ యూసుఫ్, నాబార్డు అధికారి శివిశర్మ, ఆర్బీఐ అధికారి రాజేంద్రప్రసాద్, డీఆర్డీవో పద్మజారాణి, జడ్పీ సీఈవో దేవసహాయం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, ఆయా బ్యాంకుల అధికారులు, కంట్రోలర్లు తదితరులు పాల్గొన్నారు.