జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం ప్రతినిధి జూలై 24 (ప్రజాబలం) ఖమ్మం ప్రభుత్వం మహిళా శక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో మహిళా శక్తి కార్యక్రమ యూనిట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల వారిగా మహిళా శక్తి కార్యక్రమ కార్యాచరణ చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతంలో ఉన్న డిమాండ్ ను బట్టి యూనిట్ల ఎంపిక చేయాలన్నారు. బ్యాంకు లింకేజ్ రుణాలతో పచ్చళ్ళ తయారీ, కిరాణా, మొబైల్ టిఫిన్, టైలరింగ్, మెకానిక్, టీ స్టాల్, మెడికల్ షాపు, ఫర్టిలైజర్ షాప్, మీ సేవా, పాడి పశువుల, పౌల్ట్రీ, బోటిక్, లాండ్రీ, బ్యూటీపార్లర్ మొదలగు వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటు కోరకు లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని ఆయన తెలిపారు. ఇదివరకే సంబంధిత యూనిట్లను నడుపుతూ, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకే గ్రామం, ప్రాంతంలో ఒకే తరహా యూనిట్లు ఒకటి కంటే ఎక్కువ ఏర్పాటు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యూనిట్ క్యాచ్ మెంట్ ఏరియా లాభదాయకంగా వుండేలా చూడాలన్నారు. మెడికల్, ఫర్టిలైజర్, మీ సేవా తదితర యూనిట్లకు లైసెన్సులు తప్పనిసరి అని ఆయన తెలిపారు. మండలాల వారిగా గుర్తించి, ఎంపికయిన యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని, వారం వారం వారిగా గ్రౌండింగ్ యూనిట్ల లక్ష్యం పెట్టుకొని, తదనుగుణంగా కార్యాచరణ చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ నుండి, యూనిట్లు ఆయా వ్యాపారంలో నిలద్రొక్కుకోవడానికి కొంతకాలం పాటు అధికారులు పర్యవేక్షణ చేస్తూ, సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అన్నారు. సృజనాత్మక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మహిళా శక్తి కార్యక్రమం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, ఈ దిశగా వ్యాపార ధోరణితో ఎదగాలని ఉత్సాహంగా ఉన్న మహిళా సంఘాలకు ప్రాధాన్యం కల్పించాలని కలెక్టర్ అన్నారు ఈ సమావేశంలో ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డిఆర్డీవో సన్యాసయ్య, అదనపు డిఆర్డీవో నూరోద్దీన్, డిపిఎం లు శ్రీనివాస రెడ్డి, రేవతి, దర్గయ్య, డి. శ్రీనివాస్, పద్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.