ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..కుమురంభీం జిల్లా జైనూరులో చోటుచేసుకున్న ఘటనపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయించాలని ఎంబీటీ (మజ్లిస్ బచావో తహ్రీక్) అధికార ప్రతినిధి అంజద్ ఉల్లాఖాన్ కోరారు. గురువారం జైనూరు వెళ్లేందుకు వచ్చిన ఆయనను ఉట్నూరు ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకొని తిప్పి పంపించారు. ఈ మేరకు నిర్మల్లో విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల నిఘా వైఫల్యం వల్లనే అల్లర్లు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అత్యాచారం, హత్యాయత్నం, ప్రమాదం..అనే విషయాలేవీ నిర్ధరణ కాకముందే ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టారని విమర్శించారు. ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ ఘటనలో బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో మత ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. మాజీ వైస్ చైర్మన్ మున్సిపల్ వాజిద్ అహ్మద్ ఖాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంబీటీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.