కంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి,
జీఓ 58 అర్హులకు భూ క్రమబద్ధీకరణ పత్రాల పంపిణీ ప్రారంభించాలి,
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 16:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, 58, 59, 118 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చేయాల్సిన క్రమబద్దీకరణ, తెలంగాణకు హరితహారం, రెండు పడక గదుల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య లతో కలిసి జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు శిబిరాల నిర్వహణ పట్ల శ్రద్ద వహించాలని, రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని శిబిరాల వద్ద అవసరమైన చల్లని నీరు, ఓఆర్ఎస్ ను అందుబాటులో ఉంచడం వంటి ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలకు కంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ జరుగుతుందని, వాటిని సదరు లబ్దిదారులకు అందించిన తరువాత లబ్దిదారుని ఫొటో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. తెలంగాణకు హరితహారం కింద వచ్చే సంవత్సరంలో అవసరమైన మొక్కల పెంపకం నర్సరీలో పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. జిల్లాలో మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలు పక్కాగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని మొక్కల సంరక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఓ 58 ప్రకారం ఆమోదించిన దరఖాస్తుదారుల పట్టాలను స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల ధృవీకరణ పూర్తి చేయాలని, ఫీల్డ్ వెరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పనులను నిర్ధేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన అన్ని విషయాలను తప్పకుండా పాటిస్తామని ఈ విషయంలో జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో సిద్దంగా ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 58, 59 ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) ప్రకారం 58వ జీవోలో 9,169 దరఖాస్తులు ఉండగా ఏమాత్రం పెండింగ్లో ఉండకుండా అన్నింటినీ పూర్తి చేసి అప్రూవ్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. అలాగే జీవో 59లో 5,743 దరఖాస్తులు ఉండగా వాటన్నింటిని శనివారం లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. దీంతో పాటుగా 118జీవో కింద 2,669 అప్లికేషన్లు వచ్చాయని వాటిని పదిహేను రోజుల్లో పూర్తి చేసి క్లియరెన్స్ చేస్తామని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణిలతో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.