ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 9 (ప్రజాబలం) ఖమ్మం పొట్టకూటి కోసం ఆటో నడిపే కార్మికుల నుండి అడ్డాల స్టిక్కర్ల పేరుతో డబ్బులు వసూలు చేసేవారికి పొంగులేటి శీనన్న గురించి మాట్లాడే అర్హత లేదని ఐ ఎన్ టీ యూ సీ నగర అధ్యక్ష, కార్యదర్శులు నరాల నరేష్, సిహెచ్. విప్లవ్ కుమార్ పేర్కొన్నారు. పొంగులేటి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మిక చట్టాల మేరకు కొనసాగాల్సిన యూనియన్లకు బీఆర్ఎస్ కేవి రాజకీయ రంగు పూస్తుందని ఆరోపించారు. రెండు రోజుల క్రితం ఐ ఎన్ టీ యూ సీ ఆటో యూనియన్ వర్కర్స్ సమావేశంలో పొంగులేటి శీనన్న ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను పంపిణీ చేయడం, కిమ్స్ ఆసుపత్రి తరుపున 50శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను అందజేయడాన్ని కూడా అధికార పార్టీ ఆటో యూనియన్ నాయకులు ఓర్వడం లేదని విమర్శించారు. తెలంగాణ జనగర్జన సభ జరిగినప్పటి నుంచి ఆటోకార్మికులపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. శీనన్న పై అభిమానంతో కొందరు, పొట్టకూటి కోసం డబ్బులు వస్తాయని ఇంకొందరు సభ విజయవంతం కోరుతూ ప్రచారం నిర్వహిస్తే వారిని అప్పటినుంచి తీవ్రంగా వేధించడమే కాకుండా చంపుతామని కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఐ ఎన్ టి యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన పొంగులేటి శీనన్న అండగా ఉంటారని తెలిపారు. ఎవరూ కూడా అధికార పార్టీ యూనియన్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడొద్దని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో సత్తార్ మియా, జంగిపల్లి ప్రసాద్, నాగరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.