సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా గురువారం ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్నవారిని సిపిఆర్ నిర్వహించడం ద్వారా రక్షించవచ్చని ఆ దిశగా ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రాణానికి మించి ఏది లేదని, మన చుట్టుప్రక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే పది నిముషాల వరకు సిపిఆర్ చేస్తూ,ఊపిరి అందిస్తే ఒక నిండు జీవితాన్నీ, కుటుంబాన్ని కాపాడగలిగిన వారమవుతామని అన్నారు.గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది కి శిక్షణ లో భాగంగా స్థానిక అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి, ఎస్పి ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబు, ప్రజాప్రతినిధులతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మన అలవాట్లు, తినే ఆహారం, తదితర కారణాల దృష్ట్యా 50 ఏళ్ల లోపు వారికి కూడా గుండెపోటు వస్తున్నాయని,గుండె పోటు వచ్చిన వారికి వైద్యుని కొరకు వేచి చూడకుండా వెంటనే సిపిఆర్ నిర్వహించడం ద్వారా మరణాలు తగ్గించవచ్చని అన్నారు. గుండె పోటు వచ్చిన వ్యక్తికి తక్షణ ప్రథమ చికిత్స అందించడం వలన ప్రాణాలను కాపాడొచ్చని సిపిఆర్ పై అవగాహన ఉండడం ద్వారా మానవతా దృక్పధంతో సకాలంలో స్పందించి సిపిఆర్ నిర్వహించి విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.ఆ దిశగా శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఇటీవల వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారని , వారికి సకాలంలో సిపిఆర్ నిర్వహించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారని, ఆ స్ఫూర్తితో ఫ్రంట్ లైనర్స్ కు శిక్షణ ఇవ్వడం ద్వారా కొందరి ప్రాణాలైనా కాపాడవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. జిల్లాలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీ బృందాలతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
సిపిఆర్ నిర్వహించే ముందు ఆ వ్యక్తి నిజంగా గుండెపోటుకు గురయ్యారా లేదా అని గుర్తించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ధన్ రాజ్ మాట్లాడుతూ సిపిఆర్ అంటే ప్రజలలో చాలామందికి అవగాహన వచ్చిందని, కానీ ఎలా చేయాలో తెలియదని ఆకస్మికంగా కుప్పకూలిన వ్యక్తిని పలకరించి, నాడి , ఊపిరి తీసుకుంటున్నారో పరిశీలించాలని, గుండె పోటు అని నిర్దారణకు వచ్చిన వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తూ ఒక నిముషంలో 100 నుండి 120 సార్లు గుండెపై రెండు చేతులతో పుష్ అప్ చేస్తూ మధ్య మధ్య ఊపిరిఅందిస్తుండాలని అన్నారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, ఆశా వర్కర్లు, ఏ.ఎన్ .ఏం. లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking