సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ చేయనున్న రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 2:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అంతా సిద్దం చేసినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 2వ తేదీ శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల అంగరంగ వైభవంగా ప్రతిరోజూ రోజుకు ఒక కార్యక్రమం చొప్పున నిర్వహించేందుకు ఇప్పటికే పూర్తి కార్యాచరణ సిద్దం చేసి అందుకు అధికారులకు అప్పగించినట్లు పేర్కన్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఈనెల 2వ తేదీ శుక్రవారం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించనున్నారు. దీనికిగాను ఉదయం 8.20 గంటలకు కీసర చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. అనంతరం శామీర్పేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణం ఆవరణలో ఉదయం 9 గంటలకు మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించి దశాబ్ధి ఉత్సవ సందేశం, అవార్డుల ప్రధానోత్సవం అనంతరం వందన సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు.