నకిలీ అస్సెస్ మెంట్లపై ఆరా..
జగిత్యాల ప్రతినిధి, మార్చి 27(ప్రజాబలం) “నకిలీ అస్సెస్ మెంట్లతో ఇంటి పర్మిషన్లు” అనే శీర్షికతో ప్రజాబలం దినపత్రికలో మార్చి 15 న వచ్చిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు విజిలెన్స్ అధికారులకు ఈ విషయంపై విచారణకు సమాచారం చేరవేయడంతో మరో నాలుగు రోజుల్లోగా విజిలెన్స్ అధికారులు జగిత్యాల మునిసిపల్ లోని టౌన్ ప్లానింగ్ విభాగం లో తనిఖీలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ప్రజాబలం దిన పత్రికలో వార్తా కథనం ప్రచురితమైన తరువాత మరో నకిలీ అస్సెస్ మెంట్ పత్రాలతో మరో ఇంటి యజమాని పర్మిషన్ కోసం వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఒరిజినల్ డాక్కుమెంట్లు తేవాలని సదరు యజమానిని మునిసిపల్ అధికారి కోరగా ఇంటి యజమాని తెచ్చిన ఒరిజినల్ కాస్త నకిలివేనని తెలిసింది. దీనితో సదరు మునిసిపల్ అధికారి ఆ ఇంటి యాజమానిని బెదిరించి పంపినట్లు తెలిసింది. అలాగే ఈ నకిలీల సృష్టికి కారకుడైన వ్యక్తి ఈ విషయంలో సహకరించాలంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆశ్రయించినట్లు వారందరు చేతులెత్తేసినట్లు సమాచారం. జగిత్యాల మునిసిపల్ కమిషనర్ గా పనిచేసిన స్వరూపారాణి తదుపరి పని చేసిన కమిషనర్ల మొదలు ఇప్పటి వరకు మునిసిపల్ ద్వారా పొందిన ఇంటి నిర్మాణ అనుమతులన్నింటిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని నకిలీల చరిత్ర వెలుగు చూస్తుందని సమాచారం.