వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 4:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ ప్రభుత్వ సూచనల ప్రకారం పకడ్భందీగా అమలు చేస్తున్నామని ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రుణమాఫీ, కారుణ్య నియామకాలు, ఆసరా ఫించన్లు, ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) 59 రెగ్యులరైజేషన్స్, గృహలక్ష్మి, వర్షాలు తదితర పలు అంశాలపై సమీక్షించి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
అన్నదాతకు ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీ చేస్తోందని, రుణమాఫీ వర్తింపజేసిన రైతులకు సైతం తిరిగి కొత్తగా పంట రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేస్తూ లబ్ది చేకూర్చనుందని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో మొదటగా లక్షా పది వేల రూపాయల లోపు పంట రుణాలు కలిగి ఉన్న వారికి రుణ మాఫీని వర్తింపజేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద 9654 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని వివరించారు. బ్యాంకు అకౌంట్లు రద్దు చేసుకోవడం, వినియోగంలో లేకపోవడం వంటి కారణాల వల్ల లక్షా 60 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బు జమ కాలేకపోయిందన్నారు. అయినప్పటికీ సదరు రైతుల ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసుకుని పరిశీలన జరుపగా, 95845 మందికి రైతుబంధు ఖాతాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వారికి రుణమాఫీ డబ్బులు త్వరలోనే ఖాతాల్లో జమ చేయిస్తామని తెలిపారు. మిగతా సుమారు 48 వేల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించాలని కలెక్టర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యత క్రమంగా మొత్తం 42 లక్షల మంది రైతులకు ప్రభుత్వం లక్ష రూపాయల లోపు పంట రుణాల మాఫీని వర్తింపజేస్తుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఈ నెలాఖరు లోపు నూటికి నూరు శాతం కొత్త రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి ఆసరా పెన్షన్లు, కారుణ్య నియామకాలు తదితర కార్యక్రమాల ప్రగతిని జిల్లాల వారీగా సమీక్షించారు. ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మృతి చెందినట్లైతే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జీవిత భాగస్వామికి కొత్తగా మంజూరు చేసే ప్రొసీడింగ్ పత్రాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎం.పీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పించేందుకు కృషి చేయాలని అన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేగవంతంగా నియామకాల ప్రక్రియను పూర్తి చేయడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను అభినందించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దీనికిగాను జిల్లా స్థాయి అధికారులతో ముందస్తుగానే ప్రణాళిక రూపొందించుకొని పకడ్భందీగా చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా రుణమాఫీని ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారని తెలిపారు. అలాగే జిల్లాలో కారుణ్య నియామకాలకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి నియామకపత్రాలను అందచేసినట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ మంత్రులు, అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన వారికి ఆసరా పింఛన్లను పారదర్శకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. జీ.ఓ 59 క్రింద ఇప్పటికీ నోటీసులు అందుకున్నవారి నుండి రెగ్యులరైజేషన్ కు నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు తీసుకొంటానము అని తెలిపినారు . జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) 59 కింద విలువైన భూములకు (హై వాల్యూ ల్యాండ్) సంబంధించిన 4900 అప్లికేషన్స్ వచ్చినవి అని వాటిని వేగవంతం చేస్తామని ఈ విషయంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. అలాగే ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు సమీక్షలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) 59 ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తామని వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వివరించారు.
జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మీ పథకం కింద ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 17 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి వర్తించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో నియోజకవర్గానికి మూడు వేలు చొప్పున ఈ శనివారం వరకు గృహలక్ష్మీ పథకంకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అందించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.