విద్యుత్‌ అమరవీరుల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం

ఖమ్మం ప్రతినిధి ఆగస్ట్‌ 28 (ప్రజాబలం) ఖమ్మం పోరాటంలో అసువులు బాసిన విద్యుత్‌ అమర వీరులకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం లోని విద్యుత్‌ అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ స్థూపం వద్ద నివాళులు అర్పించారు జోహార్‌ విద్యుత్‌ అమరవీరులకు జోహార్‌ నశించాలి నశించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం. రద్దు చేయాలి విద్యుత్‌ సవరణ బిల్లు-2020 రద్దు చేయాలి అని పెద్దపెట్టున నినదించారు. అనంతరం 2000 సంవత్సరంలో విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేక ప్రదర్శన ప్రదేశం సందర్భంగా షహిద్‌ చౌక్‌ వద్ద (బషీర్‌ బాగ్‌) వద్ద పోలీసుల జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరుల 23వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వామపక్ష నాయకులు కార్యకర్తలు చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, ప్రజాపంధా జిల్లా నాయకులు మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోన్నం వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గిరి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నిడివి లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ, ఆనాడు చంద్రబాబునాయుడు విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించారని విమర్శించారు. విద్యుత్‌ రంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేటీకరించొద్దు అని డిమాండ్‌ చేస్తూ ఆనాడు 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్‌ పోరాటం చేశామన్నారు. ఆనాటి పోరాటం, విద్యుత్‌ అమరవీరుల త్యాగాల వల్ల రైతులకు ఉచిత విద్యుత్‌, పేదలకు క్రాస్‌ సబ్సిడీని పాలకులు ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల జాబితాలోని విద్యుత్‌ను లాగేసుకొని సంస్కరణలు తీసుకువచ్చిందని, 23 ఏళ్లు గడుస్తున్న ఆనాటి విద్యుత్‌ పోరాట దృశ్యాలు కండ్ల ముందు మెదలాడుతున్నాయన్నారు. ఆనాటి ఘటన యాదృచ్ఛికమైనది కాదని, ప్రభుత్వ విధానాలకు సంబంధించినదని చెప్పారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు మరింత కష్టాలలోకి నెట్టబడుతున్నారని తెలిపారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడక తప్పదని హెచ్చరించారు. నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. సంస్కరణలు, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలపై ఉందని, విద్యుత్‌ అమరవీరుల సాక్షిగా ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. విద్యుత్‌ పోరాటం, ముగ్గురు అమర వీరుల త్యాగాల వల్లనే నేటికి కూడా విద్యుత్‌ చార్జీలు పెంచాలంటే పాలకులు భయపడుతున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం నుంచి వైదొలగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే విద్యుత్‌ సంస్కరణల వల్ల ప్రజలపై భారం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచ బ్యాంకు, కార్పొరేట్‌ కనుసన్నల్లో మోడీ పాలన నడుస్తున్నదిని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు వై. విక్రమ్‌ సిపిఐ జిల్లా నాయకులు సింగు నరసింహారావు పోటు కళావతి, ఎండి సలాం ప్రజాపంథా జిల్లా నాయకులు రామయ్య శీను, కే పుల్లయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking