ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..బుధవారం ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని, దీని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిని గుర్తించి బాధ్యతగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతకు కుటుంబ సభ్యులు అవగాహనా కల్పించాలని అన్నారు. మాదకద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు,వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలలొ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.యువత మత్తు పానీయాలు, సిగరెట్లు,గుట్కాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని అన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పౌరులు మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా మాదక దవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మదకద్రవ్యాల అమ్మకం,రవాణా, వాటి మూలాలు ఎక్కడున్నాయనే వాటి పైన ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదకద్రవ్యాలు అమ్మిన, సరఫరా చేసిన వెంటనే పోలీస్ శాఖ నెంబర్ 8712671111 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14446 కు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనను తమ బాధ్యతగా భావించి చదువుకునే యువత మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసు,రెవెన్యూ అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.