అడవులు అనేక జీవులకు అవాసకేంద్రాలు .జీవుల శరీరంలో ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి . అందుకే అడవులు భూమికి శ్వాసకోశాల ( గ్రీన్ లంగ్స్ ) వంటివి . ఇవి గాలి కాలుష్యకారకాలను తొలగిస్తాయి . సహజ వాతావరణ ప్యూరిఫైయర్స్ గా పనిచేస్తాయి .కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారఉత్పత్తులతో పాటు కలపను , ప్రాణవాయువు ( ఆక్సిజన్ )ను సమృద్దిపరిచే ప్రధాన కార్యాలయాలుగా పనిచేస్తాయి . గ్రీన్ హౌస్ వాయువుల రిజర్వాయర్ గా ఉంటాయి . అడవులు ఔషద , ఆహార మొక్కలకు , వృక్ష , జంతు మరియు జలవనరులకు ఆలవాలం . వర్షపాతానికి ప్రధాన ఆధారం . నేలకోత నివారణకు , శబ్దకాలుష్య నియంత్రణకు తోడ్పడుతాయి . జీవవైవిధ్య స్థిరత్వంలో సహాయ పడుతాయి . అడవులు సౌందర్యాత్మక మరియు రసాత్మక , మానసికోల్లాస విలువలను కలిగి ఉంటాయి . భూమిపై మొట్టమొదటి మొక్కలు సుమారు 470 కోట్ల సంవత్సరాల క్రితం కేంబ్రియన్ కాలంలో ఉద్భవించినాయి . ఆ తర్వాత 100 కోట్ల ఏండ్ల అనంతరం డీవోడియన్ కాలంలో అడవులు మొదటిసారి భూమిపై రూపుదిద్దుకున్నాయని జీవశాస్త్ర చరిత్ర చెబుతోంది . నాటినుండి మానవుడు జ్ఞానవిప్లవం , వ్యవసాయ విప్లవాలతో చెట్లతో సహవాసం చేస్తూ ప్రకృతి వరణంలో జీవిస్తున్నాడు . కానీ ఆధునిక మానవుడు నిరంతరం అభివృద్ది , పట్టణీకరణలపై ఎక్కువ మక్కువ చూపుతూ స్వార్థంతో ప్రకృతి వినాశననికి పాల్పడుతున్నాడు . పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలు , నివాసస్థలాల భవనసముదాయాల నిర్మాణం కోసం విచక్షణా రహితంగా చెట్లను నరికివేయడం వల్ల సంప్రదాయ పర్యావరణ విలువలు తగ్గి అడవుల విధ్వంసానికి దారితీస్తున్నది . ఇది భూతాపం , లానినో , ఎల్నినో , వేడిగాలులు వంటి వాతావరణ అసాధారణతలకు , వరదలకు , కరవుకాటకాలకు , విపత్తులకు కారణమవుతోంది .అడవుల్లో వ్యాధిగ్రస్తమైన మరియు క్రూరజంతువులు జనవాసాల్లోకి రావడం వల్ల ఎబోలా , జికా , బర్డ్ ఫ్లూ , సార్స్ , ఫ్లూజ్వరం , కరోనా ( కోవిడ్ -19 ) వంటి జూనోటిక్ వ్యాధుల వ్యాప్తితో పాటు ధన , ప్రాణ నష్టం జరుగుతోంది . ఈ సమస్యలకు ఏకైక మార్గం చెట్లను పెంచడమేనని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు . ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి జనరల్అసెంబ్లీ తీర్మానం మేరకు ప్రస్తుత మరియు ముందు తరాలకు అడవుల ప్రాముఖ్యత , ప్రయోజనాలను , విలువలను మరియు అడవుల విధ్వంసం వల్ల కలిగే నష్టాలను తెలియజేయడానికి 2013 నుండి ప్రతి సంవత్సరం మార్చి 21 న “ అంతర్జాతీయ అటవీ దినోత్సవం “ జరుపుకుంటున్నాము . గత ఏడు “ అడవులు మరియు స్థిరమైన ఉత్పత్తి మరియు వినియోగం “ అనే ఇతివృత్తంతో జరుపుకున్నాము . ఈ సంవత్సరం 2023 లో “ అడవులు మరియు ఆరోగ్యం “ అనే నినాదంతో ప్రపంచ అటవీ మహోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాము .

విధ్వంసపు ముప్పులో అడవులు :భూగోళం ఇప్పుడు అనేక సమస్యలను , సవాళ్లను ఎదుర్కొంటున్నది . ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం , భూతాపం , భూచల్లదనం , ఓజోన్ క్షీణత , దృవప్రాంతాల్లో మంచు కరగడం , అణుయుద్దాలు , భూకంపవిస్పోటనాలు , అసాధారణ వాతావరణ మార్పులు , మహమ్మారి వ్యాధుల వ్యాప్తి , అడవుల క్షీణతలు అనేవి ఆందోళనకు కారణమవుతున్నాయి . ఆటవిక భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం , సరైన భూమి నిర్వహణ పద్దతుల లేమి , మానవనివాసాలను సృష్టించడం , రియల్ ఎస్టేట్ వ్యాపారం , కలపను నిలకడగా కోయడం , పరిశ్రమల స్థాపన , అదుపులేని అక్రమ మైనింగ్ వంటి చర్యలు అడవుల విధ్వంసానికి సాధారణ కారణాలవుతున్నాయి . సహజంగా భూమిపై మూడింట ఒక వంతు విస్తీర్ణంలో అడవులు ఆక్రమించి ఉన్నాయి . యూఎన్ఓ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం అటవీ నిర్మూలన వల్ల ప్రపంచంలో 1 లక్ష 30 వేల కీ. మీ మేర అడవులు అంతరించి పోతున్నాయని అంచనా . ప్రపంచవ్యాప్తంగా 19 వ శతాబ్దం నుండి సుమారు 12.9 కోట్ల కి.మీ కు పైగా విస్తీర్ణంలో అటవీ భూములు కనుమరుగైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి . గత 30 ఏండ్లలో 10 శాతం మేర సుమారు 420 మిలియన్ హెక్టార్స్ అటవీ భూములు కోల్పోయినట్లు “ ది స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫారెస్ట్స్ -2022 నివేదిక “ పేర్కొంది . మన దేశ జాతీయ అటవీ విధానం ప్రకారం-1952 ప్రకారం దేశ భూభాగంలో 33 శాతం విస్తీర్ణంలో అడవులు కలిగిఉండాలి . కానీ మనభూభాగంలో 24.62 శాతం మాత్రమే అడవులు కలిగిఉన్నట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021 చెబుతోంది . కనుక అడవుల ఆవశ్యకతను ఇప్పటికైనా పాలకులు , ప్రజలు గ్రహించకపోతే ఆక్సిజన్ కొరత , వాయకాలుష్యం భవిష్యత్తులో ఒక సాధారణ సమస్యగా మారి , రానున్నకాలంలో ఊపిరి తీసుకోవడానికి ప్రాణవాయువు కూడా దొరుకని దుర్బరపరిస్థితి ఏర్పడుతుందని గమనించాలి . ఇటీవల జరిగిన గ్లాస్గో సదస్సు-2022 ( కాప్-26 ) లో 2030 నాటికి అడవుల నరికివేతకు పుల్ స్టాప్ పెడుతామని భారత్ తో సహ 110 దేశాధినేతలు చేసిన వాగ్ధానాలను అమలుపరచాలని పర్యావరణవేత్తలు బలంగా అభిప్రాయపడుతున్నారు .
చారిత్రక హరిత దార్శనికతే ఆదర్శం :ప్రపంచ మానవ చరిత్రలో భారతీయులు అనాది నుండి ప్రకృతి పిపాసకులు మరియు వనపరేమికులు . సుమారు 10 వేల ఏండ్లనాడే చారిత్రక పూర్వకాలంలో చెట్ల ప్రాముఖ్యతను గ్రహించి , పెంచి పోషించినారు . మనదేశంలో సిందూనాగరికత మొదలుకొని వేద , పురాణ కాలాలలో ప్రజలు చెట్లను ఆహార , ఫల , పుష్పాదులు మరియు ఆహ్లాదం కొరకే కాకుండా దేవతలకు సింబాలిక్ గా భావించి పూజించి సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు ముఖ్య భూమిక అయినారు . రామాయణ కాలంలో పుష్పకవనం , అశోకవనం , అలకాపురివనం , నందనవనం , మధువనం , దండకారణ్యంలను మరియు మహాభారత కాలంలోఖాండవవనం , మేరుపర్వత సమీప అడవులను అభివృద్ది పరిచారు . నాడు ఋషులు , సిద్దులు ఫలరసాలను తాగి సుదీర్ఘ కాలం జీవించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి . “ ఒక చెట్టు పదిమంది పుత్రులకు సమానమని “ పద్మపురాణంలో చెప్పబడింది . చెట్లు భూమిపై మొట్టమొదటి జీవులని , మనందరి కంటే పెద్దవారు “ అని ఉపనిషత్తులలో పేర్కొనబడింది . బౌద్దుల కాలంలో నలందా , తక్షశిల వనాలతో పాటు బుద్దవనం , అమలాక్షవనం , వేణువనం , నాగవనం తదితర 40 కి పైగా వనాలను అభివృద్ది పరిచారు . అఖండ భారతాన్నేలిన అశోకచక్రవర్తి ఆనాడు రోడ్లకీరువైపుల మొక్కలను నాటించి చరిత్రలో వనపరేమికుడుగా ఖ్యాతి నొందినాడు . చోళులకాలంలో ఆనందవనాలు ( హెవన్లీ గార్డెన్స్ ) , మొఘలాయిల కాలంలో ఆహ్లాదవనాలు ( ప్లేజర్ గార్డెన్స్ ) పెంచారు . దీంతో ఆనాడు ప్రజలు , పాలకులు తమ స్వీయమనుగడ , ప్రజాసంక్షేమం కోసం చెట్లను పెంచి పర్యావరణ పరిపుష్టికి తోడ్పడినారని అవగతమవుతోంది . కానీ నేడు మనిషి సృష్టిస్తున్న టెక్నాలజీతో స్వచ్చమైన గాలిని అందించే అడవులు లేకుండా పోతున్నాయి . ఇంతటి ఘనమైన చారిత్రక , సాంస్కృతిక హరిత పరిపుష్టి కార్యక్రమాల వారసత్వాన్ని పునికిపుచ్చుకొని స్వాతంత్య్రానంతరం స్వయం సమృద్ది , సస్యశ్యామలం లక్ష్యాలుగా భవిష్యత్ తరాల భద్రత కోసం మనదేశంలో అటవీ మరియు చెట్ల విస్తీర్ణాన్ని 33 శాతం పెంచడానికిజాతీయ అడవుల పెంపకం కార్యక్రమం , వనమహోత్సవం , గ్రీన్ ఇండియా మిషన్ , జాతీయ గ్రామీణ ఉపాది పథకం , నమామి గంగే , గ్రీన్ యాత్ర , సంకల్ప్ పర్వా వంటి ఎన్నో హరిత కార్యక్రమాలు చేపట్టబడ్డాయి . పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన బృహత్తర హరిత ఉద్యమం “ హరితహారం “ లో మొత్తం 235 కోట్లకు పైగా మొక్కలు నాటి , లక్ష్యాన్ని అధిగమించి దేశంలోనే గొప్ప ఆదర్శ హరితకార్యక్రమంగా నిలుస్తోంది . ఇలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల జనహిత పర్యావరణ కార్యక్రమాల అమలు వల్ల భారతీయులు భవిష్యత్ చారిత్రక హరిత దార్శనికతకు ప్రతీకలుగా నిలుస్తున్నారు .
అమృతాదేవి బిష్నోయ్ స్పూర్తితో :నేడు మానవుడు పర్యావరణం నుండి ప్రయోజనం పొందడంలోనే చురుకుగా ఉంటూ , తిరిగి ఇవ్వడం మర్చిపోతున్నాడు . మనిషికి మొక్కలతో గల సంబంద బాంధవ్యాల గురించి ‘ సోషల్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ ‘ అనే పుస్తకంలో పేర్కొన్న మాటలు సదా ఆచరణీయమైనవి . “ భూమిపై మొట్టమొదటి పౌరులైన చెట్లను నవ్యదృష్టి తో , సరికొత్త ఆలోచనలతో అభినందించాలి . చెట్లు మన దూరపు బంధువులుకాదు , మన కుటుంబ సభ్యులు “ అనే మైండ్ సెట్ తో చెట్లను ఆత్మీయబంధంతో పెంచి పోషించడం మన ప్రధమ కర్తవ్యం కావాలి . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వృక్ష సంరక్షణ చట్టాలను కఠినతరం చేయాలి . అడవుల పెంపకంలో స్థానికులకు భాగస్వామ్యం కల్పించాలి . ప్రతి సంవత్సరం జులై నెలలో ‘ నేషనల్ ప్లాంటేషన్ వీక్ , ప్రతి సెప్టెంబర్ లో ‘ జాతీయ వృక్ష దినోత్సవము ‘ లను అధికారికంగా నిర్వహించాలి . మొక్కల ఆవశ్యకత గురించి “ గ్రో-మోర్-ట్రీ కాంపేయిన్ “ పేరిట ప్రజలను , విద్యార్థులను చైతన్య పరిచే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి . సామాజిక అడవులు ( సోషల్ ఫారెస్ట్రీ ) మరియు శాస్త్రీయ అడవుల ( సైంటిఫిక్ ఫారెస్ట్రీ )వృద్ది కొరకు తెలంగాణకు హరితహారం లాంటి మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలి . నాటిన మొక్కల సర్వైవల్ రేటును వంద శాతం పెంపుకు కృషి జరగాలి . “ సర్ సాన్టే రుక్ రహేతో బీ సస్తో జాన్ “ ఒక మనిషి ప్రాణం కన్నా ఒక చెట్టు ప్రాణం విలువైనది అని పేర్కొన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆధునిక భారతీయ వృక్ష సంరక్షణ ఉద్యమ యోదురాలు , చిప్కో ఉద్యమ స్పూర్తి ప్రధాత అమృతా దేవి బిష్నోయ్ మాటల స్పూర్తిగా “ హెల్దీ ఫారెస్ట్స్ ఫర్ హెల్దీ పీపుల్ “ అనే ఆచరణాత్మక వైఖరితో సకలజనులం చిత్తశుద్దీతో చెట్ల పెంపకంలో , వనసంరక్షణలో ముమ్మరంగా భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉంది .

వ్యాస రచయిత : డాక్టర్ భారత రవీందర్ ( 9912536316 )