ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 10 (ప్రజాబలం) ఖమ్మం సమాజంలోని అసమానతలు రుగ్మతలు తొలగిపోవాలంటే మహిళా సాధికారత అవసరమని ఆ మహిళా సాధికారతకు మహిళ లే ముందుకు వచ్చి కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక టీటీడీసీ భవనంలో తెలంగాణ పోరాట యోుదురాలు చిట్యాల ఐలమ్మ వర్ధంతి ని పురస్కరించుకొని , వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు త్రివేణి అధ్యక్షతన మహిళా రిజర్వేషన్లు బీసీ మహిళా కోటా అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. తొలుత దివంగత నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సదస్సులో మొదట ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ గ్రీష్మ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రకటించిన రిజర్వేషన్లను త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలలో బీసీ మహిళల శాతాన్ని బట్టి రిజర్వేషన్లను పెంచాలని సూచించారు. ఇటీవల మహిళ వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా మహిళలు ముందుకు వచ్చి వీటిపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.బీసీ మహిళ రాజకీయ రిజర్వేషన్ వేదిక అధ్యక్షురాలు, రచయిత్రి దాసోజు లలిత మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బీసీ బీసీ మహిళల కు చట్టసభలలో సముచిత ప్రాధాన్యత , సాధికారత లభించాలంటే ప్రస్తుతం మహిళలకు ప్రకటించిన 33% రిజర్వేషన్లు సరిపోవని , వారి జనాభా బట్టి , రిజర్వేషన్లను 60 శాతం వరకు పెంపొదించి , అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం మహిళలు తమ సాధికారత కోసం తామే ముందుకు వచ్చి , కృషి చేయాలని పిలుపునిచ్చారు. విసికే పార్టీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ మాట్లాడుతూ భూమికోసం ,భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి , తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో తమ సాధికారతకు తమ రిజర్వేషన్ల సాధనకు సమాజంలోని అసమానతల నిర్మూలనకు మహిళలు తమ పోరాట పటిమను ప్రదర్శించాలని , ప్రస్తుతం ఆ పోరాటానికి సమయం ఆసన్నమైందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు సంఘటితంగా ఈ దేశంలో ఉద్యమాలు నిర్మిస్తూ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. బీసీ మహిళ రాజకీయ రిజర్వేషన్ల వేదిక లీగల్ అడ్వైజర్ , అడ్వకేట్ లక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుత పురుషాధిక్యత సమాజంలో స్త్రీ ,పురుష వివక్షతలు సహజమని , ఈ వివక్షత కారణంగా మహిళలపై వేధింపులు, అత్యాచారాలు , హత్యలు జరగటం సాధారణ అంశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగుతున్న ఈ వివక్ష లు , అసమానతల కు కారణం మనువాదమేనని పేర్కొన్నారు. మనువాద కారణంగా దెబ్బతింటున్న మహిళ ఐక్యత అనే విషయాన్ని గమనించి , మహిళలు తమ సాధికారతకు తామే కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి మాట్లాడుతూ మండలాలలో , నియోజకవర్గం కేంద్రాలలో ఇలాంటి సదస్సులు నిర్వహిస్తూ అక్కడి మహిళలను అవగాహన కలిగించడంతోపాటు వారిని చైతన్య పరచాలని , స్థానిక సంస్థలలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు అధిక సంఖ్యలో ఎన్నిక అయ్యేవిధంగా, మహిళా రిజర్వేషన్ల లో ఈ సామాజిక వర్గాల మహిళలకు ప్రత్యేక కోటా కోసం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమితి గౌరవ అధ్యక్షురాలు షేక్. నజీమా మాట్లాడుతూ మహిళ సాధికారత తోనే మహిళల హక్కులు నెరవేరుతాయని , ఆ హక్కుల సాధనకు మహిళలు ముందుకు వచ్చి ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సామాజిక కార్యకర్త , రిటైర్డ్ సీఐ పుల్లూరి నాగయ్య , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణోతు బద్రు నాయక్ , జర్నలిస్టు శ్రీదేవి , సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు త్రివేణి , వేదాంత మౌర్య , రాకేష్ తదితరులు ప్రసంగించగా వీర నారీమణుల ఆశయ సాధన సమితి , బీసీ మహిళ రాజకీయ రిజర్వేషన్ల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ముందు మహిళలు నిర్వహించిన ర్యాలీ , సదస్సు సందర్భంగా పక్రుద్దీన్ బృందం ఆలపించిన గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీసీ నాయకురాలు మారోజు సృజన , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక , వీర నారీమణుల ఆశయ సాధన సమితి నాయకులు విజయ్ రవీందర్ నాయక్ శ్రీలత మిగడ రామారావు చందు, దామల్ల జయ లలిత రవి గోపి వీరన్న నాయక్ శ్రీనివాస్ నాయక్ లక్ష్మణ్ మాధవి ప్రమీల నాగేందర్ అరుణ తదితరులు పాల్గొన్నారు