ప్రజాబలం ప్రతినిధి నిర్వర్ జిల్లా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరెట్ సమావేశ మందిరంలో మహిళా,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లోని పలు పాఠశాలల విద్యార్థులచే బాలికలు,మహిళల ప్రాముఖ్యత పై ప్రదర్శింపబడ్డ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పలువురు ఎఎన్ఎం, ఆశా,తదితర మహిళలు మాట్లాడుతూ,నిత్య జీవితంలో మహిళల ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.నేటి ఆధునిక యుగంలో మహిళలు అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో తమ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.అందరి ఇండ్లలో చిన్నతనం నుంచే బాలురతో సమానంగా బాలికలను పెంచాలన్నారు. బాలికలకు మంచి విద్యను అందించి, వారు జీవితంలో గొప్పగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. నేడు ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు వల్ల మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు మొదలుకొని,గొప్ప వ్యాపారవెత్తలుగా ఎదుగుతున్నారని తెలిపారు.మహిళలు అంతా తమ వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.దేశ, ప్రపంచ అభివృద్ధిలో మహిళలు నేడు కీలక పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగినులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.సోమవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో మహిళలకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లా సీనియర్ సివిల్ జడ్జి (జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్) జి.రాధిక మాట్లాడుతూ, మహిళలందరికీ మహిళల హక్కులు, చట్టాలు,రక్షణ లపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వీటిపై అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో అణగదొక్కబడిన మహిళలకు న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.మహిళలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.మహిళలు పరిపూర్ణంగా తమ హక్కులను పొందినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని తెలిపారు.
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో లింగ సమానత్వం,మహిళా సాధికారత, సాధించాలని అన్నారు. సమాజం,కుటుంబం అభివృద్ధి చెందాలంటే మహిళల చేతుల్లోనే ఉంటుందని అన్నారు. మహిళల హక్కులను కాపాడడం,సామాజిక, సాంకేతిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించాలని తెలిపారు.విద్య, ఉపాధి రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు ముందుంటారని అన్నారు.ఆరోగ్య సంరక్షణ,ఆర్థిక స్వావలంబన,తదితర అంశాలపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
అనంతరం బేటీ బచావో బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా,ఆయా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిర్వహించిన పలు పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి కలెక్టర్, అధికారులు ప్రశంసా పాత్రాలు, అందజేసి వారిని అభినందించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన మహిళా ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్ శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. మున్ముందు మరింత ఉత్సాహంతో పనిచేసి, విధి నిర్వహణలో ఉత్తమంగా నిలవాలన్నారు. అంతక ముందు జిల్లా అధికారులు కలిసి జిల్లా కలెక్టర్ ను సన్మానించారు.
ఆ తర్వాత కలెక్టరేట్ ఆవరణలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను కలెక్టర్ పరిశీలించి, బాగా ముగ్గులు వేసిన వారికి జ్ఞాపికలను అందజేసి, అభినందించారు. అనంతరం మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రత్న కళ్యాణి, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఎసిడిపిఓ నాగమణి, జిల్లా అధికారులు,ఎస్ హెచ్ జి మహిళలు, పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు,ఎఎన్ఎం, ఆశాలు,మహిళలు, ఇతర అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు