యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 3 (ప్రజాబలం) ఖమ్మం యువత మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకుని, ఉద్యోగావకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. మెగా జాబ్ మేళాను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు మెగా జాబ్ మేళా ను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మెగా జాబ్ మేళాకు వచ్చినవారు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్, వరంగల్ తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 65 పైగా కంపెనీలు, 5000 పైగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 45 వేల నుండి 50 వేల వేతనం గల ఉద్యోగాలు 500 ఉండగా, 25 వేల నుండి 45 వేల మధ్యలో 3 వేలకు పైగా ఉద్యోగాలున్నట్లు ఆయన అన్నారు. ఒక ఫ్రెషర్ కి ఆఫ్ క్యాంపస్ ద్వారా ఇది మంచి అవకాశమని అన్నారు. ఎక్కడ అవకాశాలు ఉంటే, అక్కడకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని, వచ్చిన ఏ చిన్న అవకాశమైనా విడిచి పెట్టక, ఒక్కో మెట్టు ఎదుగుతూ, లక్ష్యం చేరాలన్నారు. ప్రతి ఉద్యోగం ఒక పాఠం వంటిదని, ప్రతి ఉద్యోగం లో ఎంతో నేర్చుకోవచని, నైపుణ్యం, అనుభవం పొంది కెరీర్ పరంగా ఎడగాలన్నారు. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగకల్పన చేయనుందని, ఇప్పుడు పొందే ఉద్యోగాలతో ఉపాధి పొందుతూ, మన కాళ్ళ మీద మనం నిలబడి, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలన్నారు. యువత, విద్యార్థులు అర్హతలను బట్టి ఉద్యోగావకాశాలను పొందాలన్నారు. ఉద్యోగావకాశం ఎక్కడ వచ్చిన చేయడానికి సిద్ధం కావాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా అభ్యర్థుల ఇంటర్వ్యూలు సాఫీగా సాగేవిధంగా నిర్వహిచాలని జాబ్ మేళా చేపట్టిన కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా మెగా జాబ్ మేళా లో ఆర్డర్ పొందిన ఇద్దరికి ఆఫర్ లేటర్లను అందజేశారు. ఇట్టి జాబ్ మేళా కు జిల్లాలో 11530 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వివిధ కంపెనీలకు 1122 మంది యువత ఎంపిక కాగా, 2698 మంది యువత షార్ట్ లిస్టెడ్ అయినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి ఆఫర్ లెటర్స్ అందజేస్తారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగార్థులకు శుభాభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, జగన్నాధం, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking