గంజాయి మత్తులో యువత

భవిష్యత్తు తరాలకు బాటలు వేయాల్సిన యువత చెడు వ్యసనాలకు లోనవుతోంది. మానవాళి మనుగడకు ముఖ్యంగా పేద వర్గాల కు అందుబాటులో వుండి విఘాతం కలిగిస్తున్న మహమ్మారి గంజాయి.
మత్తు వల్ల ఆర్థిక ఇబ్బందులు, శారీరక రుగ్మతలు తథ్యమని పెద్దలు ఎంత మొత్తుకుంటున్నా, సహవాసాల ప్రభావమో,ఆధునిక నాగరికత ప్రభావమో కానీ, మాదక ద్రవ్యాలకు బానిసల వుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాదక ద్రవ్యాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. మాదక ద్రవ్యాలంటే గతంలో హెరాయిన్‌, కొకైన్‌ వంటివి మాత్రమే కాదు. గంజాయి కూడా మత్తెక్కిస్తోంది. యువతనే లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తుండడం అందోళన కలిగించే అంశం. సాధారణంగా ఒక గంజాయి మొక్క నుంచి పావుకిలో వరకు పొడి గంజాయి తయారవుతుంది. ఒక ఎకరం గంజాయి తోట నుంచి వెయ్యి కిలోల పొడి గంజాయి తయారవుతుందని గుర్తించారు. గంజాయి తెలుగురాష్ట్రాల్లో చాప కింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే ఉంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కొరియర్‌ సంస్థలు, ప్రైవేటు ట్రాన్స్పోర్టు సంస్థల ప్రమే యం కూడా ఉన్నట్టు సమాచారం. కోట్ల రూపాయిల విలువ చేసే టన్నుల కొద్ది గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. మాదక ద్రవ్యాల వ్యాపారం వందల కోట్ల పైనే ఉంటోంది.
కేంద్ర డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజె న్స్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 7 లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణ ఎంత అప్డేట్‌ అయిందటే, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో చాక్లెట్‌ రేపర్‌ లలో గంజాయి చాక్లెట్లను పెట్టి విక్రయాలు కొనసాగిస్తున్నారు. అంటే ఎంతగా గంజాయి దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి వాడడం వ్లల అది మెదడుపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. మెదడు లోని భాగాలు పనిచేయడం మందగించుతాయి. నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం అవుతాయి. మానసిక ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, దీర్ఘకాలిక తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. గంజాయి వాడకాన్ని నిరోధించాలంటే, సమాజం, కుటుంబం, ప్రభుత్వం ముఖ్య భూమిక పోషించాలి. మొత్తానికి జనాల్లో కుడా గంజాయి విషయంలో చూసీచూడని ధోరణి పెరగడం వల్ల గంజాయి వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking