కుక్క ఎవరిదో తేల్చేందుకు.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించనున్న పోలీసులు

వారసత్వం విషయంలో విభేదాలు వచ్చిప్పుడు చాలా అరుదుగా మనుషులకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఓ కుక్క విషయంలో విభేదాలు వచ్చి దానికి డీఎన్ఏ పరీక్ష చేయించనున్న తమాషా ఘటన మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ కుక్కను నాదంటే నాది అంటూ ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. చివరకు ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం డీఎన్‌ఏ పరీక్ష చేయడానికి నిర్ణయించారు.

సాహెబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఓ కుక్కను సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ పెంచుతున్నాడు. అయితే, ఆ కుక్క కనపడకుండా పోయింది. గత కొన్నిరోజులుగా అది కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, కార్తిక్‌ శివ్‌హారే అనే ఏబీవీపీ నేతకు చెందిన కుక్క కూడా కనపడట్లేదు. ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రెండు కుక్కలను పోలీసులు వెతకడం ప్రారంభించగా ఒక కుక్క దొరికింది. వారిద్దరినీ పిలిపించి ఆ కుక్క ఎవరిదని అడిగారు. ఆ కుక్క తనదేనని సాహెబ్‌ ఖాన్‌ అన్నాడు. కాదు తనదని కార్తిక్ శివ్‌హర్ వాదించాడు. మూడు నెలల క్రితం ఆ కుక్కను ఓ వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానని సాహెబ్‌ ఖాన్ తెలిపాడు. అయితే, అది తనదేనని నాలుగు నెలల కిత్రమే ఓ వ్యక్తి వద్ద కొన్నానని కార్తిక్ కూడా అన్నాడు. ‌

ఆ కుక్కను సాహెబ్ కోకా అని పిలిచేవాడు. కార్తిక్ దాన్ని టైగర్ అని పిలిచేశాడు. దీంతో ఆ కుక్కను పోలీసులు మొదట కోకా అని పిలవగా అది వారిని చూసింది. అనంతరం టైగర్ అని పిలిచారు. అలా పిలిచినా అది చూసి ఆశ్చర్యపర్చింది. దీంతో, కుక్కకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి దాని తల్లి వివరాలు తెలుసుకుంటే అసలైన యజమాని ఎవరనేది తెలుసుకోవచ్చని అందరూ కలిసి ప్లాన్ వేశారు.

పరీక్ష చేయించిన తర్వాత ఫలితాన్ని బట్టి అసలైన యజమానికి ఆ కుక్కను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఆ కుక్క చివరకు ఎవరిదని తేలుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే, కుక్క పట్ల పోలీసులు ఇలా వ్యవహరించడమేంటని జంతు హక్కుల పరిరక్షణ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags: dog dna, Madhya Pradesh

Leave A Reply

Your email address will not be published.

Breaking