ముగ్గురితో ములాఖత్..
వాళ్ళ దరఖాస్తులకే పెద్దపీట
జగిత్యాల, మార్చి 3,( ప్రజాబలం ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లెన్నోళ్లకు డబుల్ ఇండ్లు ఇచ్చేందుకు సేవాదృక్పథముతో పనిచేస్తుంటే జగిత్యాల అర్బన్ రెవేన్యూలోని ఓ లేడి సంపాదన బాటపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల పట్టణంలోని అర్హులైన లబ్ధిదారులకు డబుల్ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిది. దరఖాస్తులు పరిశీలన అనంతరం అనర్హులు లబ్ధిదారులుగా ఎంపికయ్యారంటూ ఆరోపణలతో రెవెన్యూ అధికారులు ఈ 3, 4 తేదీలలో కొత్త కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్లను జతచేసి తిరిగి నటరాజ్ థియేటర్ వద్దగల బడిలో అందజేయాలని ప్రకటించారు. అయితే మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తరువాత ఈ కులం, అదాయం సర్టిఫికెట్లను రెవెన్యూలో డిజిటల్ కీ తో అప్రోవల్ చేసి సర్టిఫికెట్ విడుదల చేయాల్సి వుంటుంది. ఇక్కడే సంపాదన కు తెరలేపి సర్టిఫికెట్ల జారీ తతంగం మొదలెట్టిన సదరు లేడి తన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తుల ద్వారా వచ్చే ఈ రెండు సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సత్వరమే పూర్తిచేస్తూ మిగతా వారి దరఖాస్తులను ఆలస్యం చేస్తున్నట్లు రెవెన్యూలోనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిచ్చే దరఖాస్తులు ఫైనల్ అనే ప్రచారం జరగడంతో కేవలం దరఖాస్తు వోచర్లతో పూర్తిపనికాదని తీరా సమయానికి ఒరిజినల్ అడిగితే లేకుంటే నష్టపోతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా సర్టిఫికెట్ ఆశించే మహిళలను వాల్ల అవసరాలను ఆసరాగా చేసుకుని ఒక్కో సర్టిఫికెట్ కు రెండు వందల చొప్పున, ఒక్కో సందర్భంలో ఐదు వందల చొప్పున వసూలు చేసే వ్యక్తులు ముగ్గురు రెవెన్యూలోని ఆ మహిళా ఉద్యోగిని సంప్రదించి డబ్బులిచ్చినోళ్ళ వివరాలను అందించగా డబ్బులిచ్చినోళ్ళ సర్టిఫికెట్లు జారీ అవుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటె సదరు మహిళా ఉద్యోగిని తీరుపట్ల తోటి ఉద్యోగులే విమర్శలు చేస్తుండడం గమనార్హం. ఉదయం 11 గంటలకు ఆఫీస్ కు రావడమే కాకుండా తోటి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి సదరు మహిళా ఉద్యోగి వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.