బిల్డర్లకు మేలు చేసిన కరెంటోళ్లు..!

 

వంద కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

ఇంప్రూవ్ మెంట్ పేరుతో ఎత్తుగడ

సర్కారు ఖజానాకు లక్షల గండి

మామూళ్ల మాటున తతంగం

జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 18, (ప్రజా బలం) ప్రముఖ బిల్డర్ల కోసం కరెంటోళ్లు కష్టపడ్డారు. ఎస్టిమేషన్ లేకుండానే వంద కేవీ ట్రాన్స్ఫార్మర్ బిగించి కరెంటోళ్లు తమ ఉడతా భక్తిని చాటుకొని ప్రభుత్వ ఖజానా దాదాపు 15 లక్షల పైగా గండి పెట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో నెలకొంది. గొల్లపెల్లి రోడ్డులో డి ఎల్ గార్డెన్స్ సమీపంలో పొలాల మధ్యన ఓ ప్రముఖ బిల్డింగ్ నిర్మాణ సంస్థ ఇండి పెండెంట్ ఇండ్లను నిర్మిస్తున్నారు. వాస్తవానికి వీరికి విద్యుత్ సౌకర్యం అవసరం వుంటుండగా వీరు ప్రత్యేక ట్రాస్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఈ దరఖాస్తుతో ఏఈ స్థాయి అధికారి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేషన్ చేయాల్సి ఉంటుందని తెలిసింది. ఈ బిల్డర్లు ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు 15 లక్షలకు పైగానే డిడి కడితే అప్పుడు ట్రాస్ఫార్మర్ బిగించి పోల్స్ వేసే కార్యక్రమాలను కరెంటోళ్లు చేపడతారన్నట్లు సమాచారం. కాగా ఇదంతా లేకుండానే ఇంప్రూమెంట్ పేరిట కరెంటోళ్లు కొత్త ఎత్తుగడ వేసినట్లు సమాచారం. గొల్లపల్లి రోడ్డులో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాల ముందున్న 25 కేవీ ట్రాన్స్ఫార్మర్స్ పై లోడు పెరిగిందంటూ వంకతో వంద కేవీ ట్రాస్ఫార్మర్ మంజూరు చేయించుకొని ఇక్కడ బిగించాల్సిన కరెంటోళ్లు 12 ఎచ్.టి పోల్స్ వేసి బిల్డర్లు కట్టిన దాదాపు 2 వందలకు పైగా మీటర్ల దూరంలో ఇండ్ల వద్దనే ట్రాన్స్ఫార్మర్ బిగించేశారు. ఇదే గొల్లపల్లి రోడ్డులో రోడ్డు వైపు ట్రాన్స్ఫార్మర్స్ నిర్మాణం చేసే అవకాశం వున్నా అలాకాకుండా లోపాయీకారి ఒప్పందాలతో బిల్డర్ల కు మేలుచేకూర్చినట్లు ప్రచారం జరిగుతోంది. ఈ ప్రకారంగా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 15 లక్షలకు పైగా గండి పెట్టినట్లు సమాచారం. ఎస్టిమేషన్, డీడీలు కట్టకుండా లోలోన ముట్టిన మామూళ్లు అందుకున్న ట్రాన్స్కో అధికారులు ఈ తతంగానికి తెరలేపినట్లు తెలిసింది. కేవలం పొలాల మధ్యన ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మాణాలను ఆ సంస్థ చేపడుతుండగా ఆ వైపు డెవలప్మెంట్ అనేది కానరాని చోట ఈ ట్రాస్ఫార్మర్ నిర్మాణంపై కరెంట్ అధికారుల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు. జగిత్యాలలో బిజెపి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఓ మహిళా నాయకురాలి మామ ఈ ఇండ్ల నిర్మాణ సంస్థలో భాగస్వామి అని తెలియగా ఇతని వ్యూహంలో భాగమే ట్రాన్స్కో అధికారుల నిర్వాకానికి కారణంగా ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కల్పించేందుకు కరెంటోళ్లు ప్రభుత్వ ఖాజానాను దుర్వినియోగం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కేవలం ఒక ఏఈ స్థాయి వరకే పరిమితం కాకుండా లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ర్మెన్ లందరి సహకారంతోనే ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ సొమ్ముతో ప్రజలకు విద్యుత్ సరఫరాకు ఇంప్రూప్మెంట్ చేయాల్సిన ఇలా దుర్వినియోగానికి పాల్పడడం బాధాకరమని పలువురు అంటున్నారు. జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ అంశంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking