రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గృహలక్ష్మీ లబ్ధిదారులకు ఉత్తర్వులు పంపిణీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 20:
తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళు లేని ఖాళీ స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులందరికీ గృహలక్ష్మీ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం సహకరిస్తుందని ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందకూడదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బుధవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఇళ్ళు లేని వారికి గృహలక్ష్మీ లబ్ధిదారులకు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలనే ఆలోచనతో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి వారికి అందచేస్తున్నారని ఈ విషయంలో గత యాభై ఆరు సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ప్రస్తుతం సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన గతంలో పాలించిన వారెవరికీ రాలేదని ఈ విషయంలో అలాంటి మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మీ, డబుల్ బెడ్రూమ్లు, గృహలక్ష్మీ వంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని మంత్రి మల్లారెడ్డి వివరించారు. మంచి ఆలోచన దృక్పథంతో చేపట్టే కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో విజయవంతమవుతున్నాయని తెలిపారు. గృహలక్ష్మీ పథకం కింద ఖాళీ స్థలం, ప్లాట్ ఉన్న వారికి రూ.3 లక్షల చొప్పున అందచేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి గృహలక్ష్మీ పథకం కింద మూడువేల ఇళ్ళకు మంజూరీ లభించగా అందులో మొదటి విడతగా ముందుగా నియోజకవర్గంలోని 800 మంది లబ్ధిదారులకు ఉత్తర్వులు అందచేస్తున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో గృహలక్ష్మీ పథకం కింద ఉత్తర్వులు రాని వారు ఎలాంటి నిరాశకు గురి కావద్దని ఎవరూ బాధపడరాదని సొంత ప్లాట్, ఖాళీ ప్రదేశం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఇప్పించే బాధ్యత తనదేనని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం కొందరికీ మాత్రమే ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని రెండో విడత, మూడో విడతల్లో సైతం అర్హులైన వారికి తిరిగి సోమవారం, బుధవారం గృహలక్ష్మీ పథకానికి సంబంధించి ఉత్తర్వులు పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని వాటిని సడలింపు చేసేలా సీఎం కేసీఆర్తో మాట్లాడినట్లు ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రతి పేదవారి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు గృహలక్ష్మీ పథకం రూపొందించామని ఈ విషయంలో ప్లాట్, ఖాళీస్థలం ఉన్న వారిందరికీ ఇంటి నిర్మాణాలు చేపట్టేలా చూస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఉత్తర్వులు అందుకొన్న లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దీంతో పాటు గృహలక్ష్మీ పథకానికి సంబంధించి ఖాళీ స్థలం, ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందని వెంటనే దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి కోరారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మేయర్లు ప్రజలకు సహకరించాలని వారికి సంబంధించిన దరఖాస్తులను తీసుకొని వాటిని సంబంధిత అధికారులకు అందచేయాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమానికి చేపట్టే ప్రతి కార్యక్రమం అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో గృహలక్ష్మీ పథకం కింద జిల్లాకు నిధులు మంజూరు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సొంతింటి కల సాకారమయ్యేలా ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టి విజయవంతం అయ్యేలా చూస్తున్నారని తెలిపారు.
అనంతరం ఉత్తర్వులు అందుకొన్న గృహలక్ష్మీ లబ్ధిదారులతో మంత్రి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి,తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.