తానిచ్చిన అంబులెన్సులపై ఫోటోలెందుకు తొలగించారు ?
మళ్లీ వాటిని పునరుద్ధరించాలి
సింగరేణి సీఎస్ఆర్ నిధులెక్కడ ?
రైల్వే పై పార్లమెంట్ లో మాట్లాడతా!
రైల్వే ఏటీఆర్ నివేదిక ఎందుకివ్వడం లేదు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సమావేశంలో వివిధ శాఖల పని తీరును సమీక్షించిన ఎంపీ నామ నాగేశ్వరరావు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జనవరి 25 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం వివిధ అభివృద్ధి పధకాలకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అధికారులను కోరారు. గురువారం జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సమావేశంలో ఎంపీ నామ మాట్లాడారు.

అంబులెన్స్ లపై ఫోటోలు ఎందుకు తొలగించారు ?
తాను అందజేసిన ఆరు అంబులెన్సులపై ఉన్న ఫోటోలను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని సంబంధిత వైద్యాధికారులను నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. దాదాపు రూ.1.23 కోట్ల ఖర్చుతో తానే ఈ ఆరు అంబులెన్సులను ప్రజల సౌకర్యాయార్థం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందని నామ పేర్కొన్నారు. కానీ తమకు సమాచారం లేకుండానే అంబులెన్సులపై ఉన్న ఫోటోలను ఏకపక్షంగా ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలని అడిగారు. మళ్లీ అంబులెన్సులపై ఫోటోల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే వైద్య శాఖలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎమ్ , డాక్టర్లు, ఇతర అన్ని రకాల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అన్ని పీహెచ్ సీలలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించాలని నామ వైద్యాధికారులకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యానికి పెద్ద పీట వేసి, అబ్బురపర్చే అభివృద్ధిని చేయడం జరిగిందని, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున వైద్య సీట్లు పెంచిన సంగతి తెలిసిందేనని అన్నారు.
రైల్వే అధికారులు సహరించడం లేదు ?
రైల్వే అధికారుల పనితీరు పట్ల నామ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి దిశ కమిటీ సమావేశంలో చెబుతున్నా ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదని నామ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే కి సంబంధించి ఏటీఆర్ రిపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నా సంబంధిత అధికారులు పట్టించు కోకపోవడం పట్ల నామ కొంత అసహనం వ్యక్తం చేశారు. గత సమావేశంలో కూడా ఇదే పరిస్థితి అని, ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని అన్నారు. సరైన నివేదికలు లేకుండానే కింది స్థాయి అధికారులు సమావేశానికి వస్తున్నారని పేర్కొన్నారు.ఈ విషయమై తాను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు.తాను ఎన్నో ఎంతో శ్రమించి సాధించిన భద్రాచలం – కొవ్వూ రు రైల్వే లైన్ సర్వే ఎంత వరకు వచ్చిందని అన్నారు. కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైళ్లను ఇంకా ఎందుకు పునరుద్ధరించ లేదని రైల్వే వారిని అడిగారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కోరగా, మూడో లైన్ పూర్తి అయితేనే వాటిని పునరుద్దరిస్తారని రైల్వే అధికారులు సమాధానం ఇచ్చారు.

సీఎస్ఆర్ నిధులెక్కడ?
సింగరేణి సీఎస్ఆర్ నిధులు గురించి తాను పంపిన ప్రతిపాదనలు ఏమయ్యాయని ఎంపీ నామ సింగరేణి అధికారులను ప్రశ్నించారు. నిధులెందుకు విడుదల చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేసి, అభివృద్ధి కి సహకరించాలని కోరారు. బీఎస్ ఎన్ ఎల్ టవర్స్, సిగ్నల్ తదితర సాంకేతిక సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో తెలియజేయాలని అధికారులను కోరారు. ఇంకా అజెండాలోని అన్ని అంశాలపైనా ఎంపీ నామ నాగేశ్వరరావు సుదీర్ఘంగా ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. పీఎంజీఎస్ వై కి సంబంధించి పనులు త్వరగా పూర్తి చేసి, ఎంపీ చేత ప్రాంభించాలని పంచాయతీరాజ్ అధికారులను కోరారు. ఇందుకు సంబంధించి ప్రోటోకాల్ను పాటించాలన్నారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్ గురించి సంబంధిత అధికారులను అడిగారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, రాందాస్ నాయక్, జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్ర శేఖర్ , ఎంపీపీలు, నామినేటెడ్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, అదనపు కలెక్టర్ రాంబాబు, డి ఆర్ డి ఏ పీడీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.