రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, బోయినపల్లి,( ప్రజాబలం ), రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగ చైతన్య (15) అనే బాలిక మల్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతూ రెండు నెలల క్రితం జరిగిన పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా రాసింది. కానీ విధి ఆ విద్యార్థినితో చెలగాటమాడింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగచైతన్య తీవ్ర అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 17వ తేదీన ప్రాణాలు విడిచింది. బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నాగ చైతన్య 510 మార్కులు సాధించి, మల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏకంగా మొదటి స్థానం దక్కించుకుంది. ఇట్టి విషయాన్ని మల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నాగ చైతన్య తల్లిదండ్రులకు విషయం తెలుపగా వారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వచ్చి తమ కూతురు సాధించిన ఘన విజయాన్ని చూసి, కూతురు తమ మధ్య భౌతికంగా లేకున్నా, తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారు రోదించిన తీరు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు, తోటి విద్యార్థిని విద్యార్థులు సైతం తీవ్ర భావద్వేగానికి లోనయ్యారు