జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి, పబ్లిక్ పరీక్షలు-2024, సజావుగా నిర్వహించేలా చర్యలు

విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి, పరీక్షా కేంద్రాల్లో వసతులు, లైటింగ్, ఫ్యాన్స్, త్రాగునీరు, టాయిలెట్స్ ఉండాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ – మల్కాజిగిరి ఫిబ్రవరి 21:జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, పదో తరగతి, పబ్లిక్ పరీక్షలు-2024.
పరీక్షలు సజావుగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ అన్నారు.
బుధవారం అదనపు కలెక్టరేట్ ఛాంబర్లో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్, పదో తరగతి, పబ్లిక్ పరీక్షలు-2024 కు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐవో) కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈవో) విజయకుమారి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్, పదో తరగతి, పబ్లిక్ పరీక్షలు-2024 నిర్వహణలో అధికారులు సమన్వయంతో తమ విధులు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 139 పరీక్ష కేంద్రాలను, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 65,965, ద్వితీయ సంవత్సరానికి 65,495 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. ఈనెల 28వ తేదీ నుంచి మార్చ్ 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు, ప్రథమ సంవత్సరం ఉదయం 9. నుండి మధ్యాహ్నం 12:00 వరకు, ద్వితీయ సంవత్సరానికి మధ్యాహ్నం 2.00 నుండి 5.00 వరకు జరుగుతాయని తెలిపినారు.
పదో తరగతి పరీక్షలు మార్చ్ 18 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారని, 231 పరీక్ష కేంద్రాల లో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, జిల్లా వ్యాప్తంగా ( రెగ్యులర్ 46834+ ప్రైవేట్ 572) 47406 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలను కల్పించాలని, స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రానికి తిరిగి పరీక్షా కేంద్రం నుండి స్ట్రాంగ్ రూంకు ఎగ్జామ్ మెటిరియల్ తరలించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను, పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, అవసరమైన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను, పరీక్షా కేంద్రాల నుండి జవాబు పత్రాలను పగడ్బందీగా తీసుకువెళ్లేందుకు పోస్టల్ శాఖ సహకరించాలని, ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి పరీక్షా సమయం కన్నా ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎవరికి కూడా అనుమతి లేదని అదనపు కలెక్టర్ తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, రాచకొండ, సైబారబాద్ పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking